మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ఇకలేరు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వట్టి వసంత కుమార్ (70) అనారోగ్యంతో విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన కొంతకాలంగా మధుమేహం, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. కొంతకాలం క్రితం ఆయనకు ఒక మూత్రపిండం మార్చారు. వారం క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన వసంత కుమార్ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తొలుత విశాఖపట్నంలోని పినాకిల్ వైద్యశాలలో చేర్పించారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారుజామున తీవ్ర గుండెపోటుతో చనిపోయాడు. భౌతిక కాయాన్ని స్వగ్రామం ప్రస్తుత ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల పంచాయతీ శివారు మల్కీమహ్మద్పురానికి తరలించారు. ఆదివారం సాయంత్రం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. వసంత కుమార్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.













