Vasireddy Padma : టీడీపీలోకి వాసిరెడ్డి పద్మ..! తెలుగు తమ్ముళ్ల ఫైర్..!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్లందరికీ కచ్చితంగా వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) తెలిసే ఉంటారు. దాదాపు దశాబ్దానికి పైగా ఆమె యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ (PRP) ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత అది కాంగ్రెస్ (Congress) లో విలీనం కావడంతో వాసిరెడ్డి పద్మ వైసీపీలో (YSRCP) చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీలో కీలక పాత్ర పోషించారు. అధికార ప్రతినిధిగా (Spokes person) పార్టీ వాయిస్ ను బలంగా వినిపించారు. ఆమె సేవలను గుర్తించి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ (Women’s commission chair person) గా నియమించారు జగన్. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించి ఆ పదవికి రాజీనామా చేశారు. కానీ టికెట్ రాలేదు. దీంతో ఎన్నికల తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు.
వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేసి నెల రోజులు దాటింది. ఈ మధ్య కాలంలో ఆమె వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజీనామా చేసినప్పుడే పార్టీ ఓటమికి జగనే (YS Jagan) కారణమని ఆమె ఆరోపించారు. ఆయన పార్టీని పట్టించుకోలేదని.. ఆయనకు పార్టీని ఎలా నడపాలో తెలీదని చెప్పుకొచ్చారు. ఇప్పుడామె ఏకంగా పార్టీ పగ్గాలను విజయమ్మకు అప్పగించాలని సూచించారు. వైసీపీపై వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు చేస్తుండడంతో ఆమెపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి బయటకు వెళ్లగానే విమర్శలు చేయడం సరికాదని ఆమెకు సూచిస్తున్నారు.
అయినా వాసిరెడ్డి పద్మ మాత్రం తగ్గట్లేదు. చంద్రబాబు, లోకేశ్ లను కించపరిచేలా పోస్టులు పెట్టినందుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) పై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె టీడీపీలో (TDP) చేరడం దాదాపు ఖాయమని అందరూ అనుకున్నారు. తాజాగా ఆమె విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో (Kesineni Chinni) సమావేశమయ్యారు. త్వరలో తాను టీడీపీలో చేరబోతున్నట్టు ఆ సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు. ఇన్నాళ్లూ ఆమె జనసేన (Janasena) పార్టీలో చేరతారనే ఊహాగానాలుండేవి. ఇప్పుడామే స్వయంగా తాను టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటించడంతో ఆ ఊహాగానాలకు బ్రేక్ పడినట్లయింది.
అయితే వాసిరెడ్డి పద్మను టీడీపీలో చేర్చుకోవడాన్ని తెలుగు తమ్ముళ్లు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఆమె వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు (Chandrababu), లోకేశ్ (Lokesh), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తదితరులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొన్ని అంశాలను ఆమె సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించారు. ఇవన్నీ ఇప్పుడు మర్చిపోయి పార్టీలో ఎలా చేర్చుకుంటారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అయితే వాసిరెడ్డి పద్మను చేర్చుకునేందుకు టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఆమె నారా లోకేశ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది. గతంలో చేపట్టిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవిని మళ్లీ ఆమెకే ఇస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి వాసిరెడ్డి పద్మ చేరిక టీడీపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది వేచి చూడాలి.













