Vasireddy Padma : జగన్పై వాసిరెడ్డి పద్మ పదునైన విమర్శలు.. కారణమేంటి..?
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నుంచి బయటికొచ్చే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. రాజకీయాల్లో ఇలాంటివి సహజమే. అధికారంలో లేనప్పుడు పక్కచూపులు చూడడం నేతలకు అలవాటే. అయితే సుదీర్ఘకాలం ఒకే పార్టీలో ఉండి.. ఆ పార్టీకి వెన్నెముకగా భావించిన వాళ్లు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్తే కచ్చితంగా ఆలోచించుకోవాలి. కామ్ గా బయటికొస్తే పర్లేదు.. పార్టీ తీరుపైన, పార్టీ అధినేత పైన పదునైన విమర్శలు చేస్తుంటే మరింతగా దృష్టి పెట్టాలి. ఇప్పడు వైసీపీ (YCP) నుంచి బయటికొచ్చిన వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) ఇలాగే చేస్తున్నారు. వైసీపీ పైన, ఆ పార్టీ అధినేత జగన్ పైన ఆమె తీవ్రంగా విరుచుకు పడుతున్నారు.
వాసిరెడ్డి పద్మ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ (Prajarajyam Party) పెట్టినప్పుడు ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ (Congress) లో విలీనం చేయడంతో.. అందులో చేరడం ఇష్టం లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో (YSRCP) చేరారు. మంచి వాగ్ధాటిగా పేరొందడంతో ఆమెకు అధికార ప్రతినిధి (spokes person) పదవిని కట్టబెట్టారు జగన్. 2014 – 19 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ వాయిస్ ను ఆమె బలంగా వినిపించారు. ఇక 2019లో అధికారంలోకి రాగానే వాసిరెడ్డి పద్మను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ (Women’s Commission Chair Person) గా నియమించారు. 2023 చివరి వరకూ ఆమె ఆ పదవిలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో జగ్గయ్యపేట (Jaggaiahpet) నుంచి పోటీ చేయాలని ఆమె అనుకున్నారు. కానీ జగన్ టికెట్ ఇవ్వలేదు.
జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభానుని (Samineni Udayabhanu) బరిలోకి దింపారు జగన్. అయితే ఆయన ఓడిపోయారు. ఇటీవలే ఉదయభాను వైసీపీని వదిలేసి జనసేనలో (Janasena) చేరిపాయారు. ఆయన వెళ్లిపోయారు కాబట్టి తనను కనీసం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా నియమిస్తారని వాసిరెడ్డి పద్మ ఆశించారు. అయితే ఆమెను కాదని తన్నీరు నాగేశ్వర రావుకు (Thanneru Nageswara Rao) నియోజకవర్గాన్ని కట్టబెట్టారు. దీంతో ఆమె తట్టుకోలేకపోయారు. ఇన్నేళ్లపాటు పార్టీకి సేవ చేసినా తనను గుర్తించలేదనే భావనకు వచ్చారు. అందుకే పార్టీకి వెంటనే రాజీనామా (resign) చేసి బయటికొచ్చారు.
వైసీపీ నుంచి బయటికొచ్చిన క్షణం నుంచే వాసిరెడ్డి పద్మ .. జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ఒక పొలిటికల్ టెర్రరిస్ట్ అని ఆమె అన్నారు. పార్టీని ఫ్యాక్షనిజం వైపు మళ్లించారని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడితే గుడ్ బుక్ (Good book) లో పేర్లు రాసుకుని ప్రమోషన్స్ (promotions) ఇస్తామని జగన్ చెప్తున్నారని.. అయితే ఇప్పుడు కావాల్సింది గుడ్ బుక్ కాదని.. గుండె బుక్ అని ఎద్దేవా చేశారు. జగన్ కు పార్టీ పట్ల కానీ, సమాజం పట్ల కానీ బాధ్యతలేదని దుయ్యబట్టారు. అయితే పార్టీని వీడిన తర్వాతే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా అని వైసీపీ నేతలు (YCP Leaders) వాసిరెడ్డి పద్మను ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వాసిరెడ్డి పద్మ తన కడుపులో ఇన్నాళ్లూ దాచుకున్నందంతా ఇప్పుడు కక్కేస్తున్నారు.












