షర్మిల ప్రచారం పై ఘాటుగా స్పందించిన వాసిరెడ్డి పద్మ..
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల తనతో పాటు వివేకా కూతురు సునీతతో కలిసి అవినాష్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆమె ప్రధానంగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి హంతకుడికి సీట్ ఎలా ఇచ్చారు అంటూ.. మా అన్నను గెలిపించకండి అంటూ మాట్లాడుతున్నారు. ఈ విషయంపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. షర్మిల నిర్వహిస్తున్న ప్రచారం ఎన్నికల నియమాలకి విరుద్ధంగా ఉందని.. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుపోతానని ఆమె పేర్కొన్నారు. రాజకీయపరంగా కాకుండా వ్యక్తిగత అజెండాతో షర్మిల జగన్ పై నిందలు వేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. వివేకా హత్య కేసు కోర్టు పరిధిలో ఉన్న విషమని.. దాని గురించి పదేపదే షర్మిల చర్చించడం మంచిది కాదని పద్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా సున్నితమైన విషయంపై వాదన, తీర్పు, శిక్ష అన్ని షర్మిలే ప్రకటిస్తే ఎలా అని ఆమె ప్రశ్నించారు. షర్మిల చేస్తున్నవి సానుభూతి రాజకీయాలు అని పద్మ విమర్శించారు. రంగులు మార్చే ఊసరవెల్లి లాంటి షర్మిల మాటలు ఎవరూ నమ్మరని.. చంద్రబాబు రాజకీయంలో షర్మిల కూడా ఒక పావుగా మారిందని పద్మ వ్యాఖ్యానించారు.













