వైభవంగా శ్రీవారికి వసంతోత్సవం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఆలయం ఎదుట స్వర్ణరథాన్ని అధిరోహించారు. భక్తులను అనుగ్రహిస్తూ తిరువీధుల్లో ఊరేగారు. వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. ఆ తర్వాత స్వామి, అమ్మవార్లు ఆలయం ఎదుటకు చేరుకుని బంగారు పల్లకీని అధిరోహించి వసంత మండపానికి చేరుకున్నారు. ఆరాధన, అభిషేకాదులు, నివేదనలు, కొలువు క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసిన తర్వాత ఉత్సవ మూర్తులను తిరువీధుల్లో ఊరేగిస్తూ ఆలయానికి వేంచేపు చేశారు. నేటితో ఈ వేడుకలు ముగియనున్నాయి.













