పవన్ గెలుపు పై వర్మ సంచలన వ్యాఖ్యలు.. పిఠాపురంలో పీక్స్ కి చేరుకుంటున్న టెన్షన్..
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఎటువంటి హై టెన్షన్ సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో రేపు జూన్ 4న జరగబోతున్న కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చోటు చేసుకోకుండా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్ది గెలుపు పై అంచనాలు.. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్న విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. రాజకీయానికి బెట్టింగ్ యాడ్ చేసిన కొందరు ఈ సందర్భంగా బాగా సొమ్ము చేసుకుంటున్నారు.
టీ బంకు దగ్గర నుంచి బస్టాండ్ వరకు.. కూరగాయల బండి దగ్గర నుంచి షాపింగ్ మాల్ వరకు.. తెలుగు వారి మధ్య సాగుతున్న రాజకీయ చర్చలలో ఎక్కువగా రెండే రెండు ప్రశ్నలు వినపడుతున్నాయి. అందులో ఒకటి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనేది.. అయితే మరొకటి పిఠాపురం పరిస్థితి ఏమిటి? పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని ప్రకటించినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఒక పక్క అయితే పిఠాపురం రాజకీయం మరోపక్క అన్నట్లు పరిస్థితులు మారాయి.
ముందుగా పవన్ రాజకీయ ట్రాక్ రికార్డు తీసుకుంటే గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పటికీ ఆయన గెలవలేకపోయారు. కేవలం స్టార్డంతో గెలవడం కుదురుతుంది అనుకుంటే క్రితం సారే గెలిచేవారు కదా.. అని ఈ నేపథ్యంగా కొందరు ఎద్దేవా చేస్తున్నారు. అయితే పవన్ ఈసారి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో తన వంతు దూకుడు కనబరుస్తూ ముందుకు వెళ్తున్నారని.. అందుకే ప్రజలు అతనికి బ్రహ్మరథం పడుతున్నారని మరొక వర్గం వాదిస్తుంది. ఎవరి వాదన నెగ్గుతుంది అనేది తేలాలి అంటే జూన్ 4 ఫలితాలు రావాలి.
ఒక వర్గం ఈసారి ఆంధ్రాలో పగ్గాలు చేపట్టేది చంద్రబాబు అంటున్నారు.. మరికొంతమంది జనం జగన్ కే పట్టం కడతారు అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. వైసీపీ నేతలు జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేయడం గెలుపు పై వారికి ఉన్న నమ్మకాన్ని తెలియపరుస్తోంది. మరోపక్క పిఠాపురంలో.. మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బైక్ నెంబర్ ప్లేట్లు తెగ సందడి చేస్తున్నాయి. ఇటు వైసీపీ వంగా గీతా తరఫున మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అనే బైక్ నెంబర్ ప్లేట్లు జన సైనికులకు పోటీగా రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్మ వ్యాఖ్యలు పిఠాపురంలో మరింత హిట్ సృష్టిస్తున్నాయి.
తనకు టికెట్ దక్కకపోయినా.. పిఠాపురంలో పవన్ వెనుక అండదండగా నిలబడిన టీడీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ… పవన్ గెలుపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ గెలుస్తాడు అని తన ఆస్తులు మొత్తం పందెం కాయడానికి రెడీగా ఉన్నానని సవాలు విసిరారు. అంతేకాదు ఈసారి ఎన్నికల్లో పవన్ గెలుపు తధ్యమని.. వర్మ చెప్పిన వ్యాఖ్యలు జనసైనికుల్లో మరింత ధీమాను పెంచుతున్నారు. నిజంగా అందరూ అనుకున్నట్టు పిఠాపురం నుంచి పవన్ గెలిస్తే అందులో వర్మ పాత్ర ఎంతో కీలకమైనది అనడంలో ఎటువంటి డౌట్ ఉండదు.













