ఏపీలో ప్రముఖులపై తప్పుడు కేసులు.. ప్రభుత్వ వేధింపులు కరెక్ట్ కాదు: వర్ల రామయ్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. సమాజంలో ఉన్న కొంతమంది ప్రముఖులను కూడా దొంగ కేసులతో ప్రభుత్వం వేధిస్తోందని విమర్శలు చేశారు. పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న వారికి తప్పుడు కేసులతో తలవంపులు తెస్తున్నారని మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా బ్రహ్మయ్య అండ్ కో సంస్థపై ఎలాంటి ఆరోపణలు లేవని, ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా ఈ సంస్థ ఆడిటింగ్ చేస్తుంటే, ఆ సంస్థకు చెందిన శ్రవణ్‌పై ఇప్పుడు సడెన్‌గా తప్పుడు కేసులు వేశారని ఏపీ సర్కారుపై వర్ల రామయ్య ఆరోపణలు గుప్పించారు. జగన్ మళ్లీ ఏపీలో అధికారం చేపట్టడం జరగదని, అందుకే అతనిలో అసహనం పెరిగిపోయిందని ఎద్దేవా చేసిన వర్ల రామయ్య.. అందుకే ఇలా వృత్తి నిపుణులపై కూడా కక్ష సాధింపు చర్యలకు దిగజారారు అని విమర్శించారు. తెలుగుజాతి గౌరవం నలుమూలలా వ్యాప్తి చెందేలా చేసిన ప్రముఖులను ఇలా వేధించడం ఏమాత్రం కరెక్ట్ కాదని, ఇప్పటికైనా ప్రభుత్వం ఈ తప్పును సరిదిద్దుకుంటే మంచిదని వర్ల రామయ్య హితబోధ చేశారు.













