మీ ఓటు హక్కును దొంగల చేతికి వెళ్ళనివ్వకండి.. వర్ల..
ఈసారి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటర్లు తమ ఓటు హక్కు మంచిగా ఉపయోగించుకోవాలని.. రాష్ట్ర భవిష్యత్తులో భాగస్వామ్యం అవ్వడం కోసం కూటమిని గెలిపించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య పిలుపునిచ్చారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్ కి తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఒక సెలవు దినముగా కాకుండా ఉద్యమంగా ప్రజలు భావించాలని.. 90 శాతం పోలింగ్ దాటేలా ఓటర్లు తమ ఓటు హక్కు వాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల లోపు అధిక శాతం లో ఓట్లు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మీరు వెళ్లేసరికి ఎవరైనా మీ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిస్తే చాలెంజ్ ఓటు అడిగి మరీ తీసుకోండి. అప్పటికే మీ ఓటు ఎవరైనా వేసినట్లు అధికారి చెబితే.. మీరు టెండర్ ఓటు హక్కును కూడా వినియోగించుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మీ ఓటు దొంగల చేతికి వెళ్ళనివ్వకండి అని పేర్కొన్నారు.













