సెంట్రల్ సీటు కోసం సిగపట్లు…
టీడీపీలో వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరాయి. పార్టీ టికెట్లు కేటాయించక ముందే గ్రూపుల మధ్య గొడవలు రోడ్డున పడుతున్నాయి. విజయవాడ సెంట్రల్లో వంగవీటి రాధా, బొండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ సాగుతోంది. రోజురోజుకు ఇరువర్గాల మధ్య విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయి. ఇటీవల బొండా ఉమా, వంగవీటి రాధాలకు సంబంధించి ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. దీంతో ఇప్పటివరకు తమదే టికెట్టు అని ధీమాగా ఉన్న బొండా ఉమా వర్గీయుల్లో కలకలం రేగింది.
మూడు రోజులుగా ట్రోలింగ్….
వంగవీటి రాధా టార్గెట్‌గా సిటీలో ‘ఇవే రాధాను టీడీపీ నమ్మకపోవటానికి కారణాలు’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఏడు కారణాలు ప్రస్తావిస్తూ మూడు రోజుల క్రితం ట్రోల్ చేశారు. ఇది సెంట్రల్ నియోజకవర్గం టీడీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ పోస్టుల వెనుక బొండా ఉమా వర్గీయులే ఉన్నారని రాధా వర్గం ఆరోపిస్తోంది. దీనికి ప్రతిగా బొండా ఉమాను టార్గెట్ చేస్తూ వంగవీటి రాధా వర్గీయులు ‘నమ్మాలంటే ఏమి చేయాలి… దేవుడి పేరుతో చందాలు పోగు చేయాలా, స్థలాలు కబ్జా చేయాలా, కాల్‌మనీ నిందితులకు కొమ్ముకాయాలా… నమ్మకానికి ఇవేనా ప్రామాణికాలు..? అంటూ పెట్టిన పోస్టులు ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు నాయకులు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ పెడుతున్న సంచలన పోస్టులు హాట్ టాపిక్‌గా మారాయి.
వంగవీటి రాధా తీరును విమర్శిస్తూ బొండా వర్గీయులు ఏడు పాయింట్లతో పోస్టులు పెడితే, దానికి కౌంటర్‌గా పదిహేడు పాయింట్లతో ఉమా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన వివాదాస్పద విషయాలను తెరపైకి తెస్తున్నారు రాధా అనుచరులు. బొండా ఉమా, వంగవీటి రాధాల పోటాపోటి సోషల్ మీడియా పోస్టులతో ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నెలఖారున టీడీపీ ప్రకటించే మొదటి లిస్టులోనే వంగవీటి రాధా పేరునే అభ్యర్ధిగా ప్రకటిస్తారని రాధా వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.
2014-19 మధ్య విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా బొండా ఉమా పనిచేశారు. 2004లో తొలిసారి సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని తహతహ లాడుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా టీడీపీలోనే కొన సాగనున్నట్లు స్పష్టం చేశారు.













