టీడీపీలోకి వంగవీటి రాధా?
సార్వత్రిక ఎన్నికల వేళ కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. గత కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుండి పోటీచేసినా రాధా ఈసారి సెంట్రల్ నియోజకవర్గం కావాలని అడిగి తీసుకున్నారు. తదనంతరకాలంలో ఆయన నియోజకవర్గ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటు వచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు లేవనే నివేదిక ఇవ్వడంతో ఆయన్ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును నియమించారు. అయితే, రాధాకృష్ణను అవనిగడ్డ నియోజకవర్గానికిగానీ, లేదా బందరు పార్లమెంటుకుగానీ పోటీచేయాలని ఆదిష్టానం ఆదేశించింది. దీనికి ససేమీరా ఉన్న రాధాకృష్ణ దాదాపుగా ఐదారు నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
రాధాకృష్ణ రాజీనామా ప్రకటిస్తారని విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం సీనియర్ నేత బొత్స సత్యనారాయణను రాయబారం పంపింది. సుమారు గంట సేపు బొత్స, రాధా మధ్య చర్చలు నడిచాయి. ఆ చర్చలు ఫలించలేదు. రాధాకృష్ణ తన రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన రాధా ఈనెల 28న తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధాకు ఒక స్థానాన్ని కట్టబెట్టేందుకు టీడీపీ ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన సన్నిహిత వర్గాలతో చర్చించిన అనంతరమే రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి నుండి సృష్టమైన హామీ వచ్చిన తరువాతే ఆయన రాజీనామ చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ తంతు అంతా బెజవాడలోని మరో ఎమ్మెల్సీ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది.













