Vangaveeti: వంగవీటి వారసుడికి ఇప్పుడైనా…?
2024 లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల పంపకాల విషయంలో… పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా కార్పొరేషన్ అలాగే ఇతర నామినేటెడ్ పదవులతో పాటుగా ఎమ్మెల్సీల గురించి చర్చ జరిగిన.. ప్రతిసారి వంగవీటి రాధ(Vangaveeti Radha) పేరు ప్రస్తావనకు వస్తుంది. తెలుగుదేశం పార్టీ(TDP)లో ఆయనకు ఏదో ఒక పదవి దక్కుతుందని చాలామంది ఎదురు చూస్తూ వస్తున్నారు. 2019లో 2024 లో తెలుగుదేశం పార్టీకి వంగవీటి రాధా సహకరించారు. 2024 లో ఆయన కొన్ని నియోజకవర్గాల్లో స్వయంగా ప్రచారం కూడా నిర్వహించారు.
ఈ ప్రచారం ప్రభావం కొంత పార్టీకి సహకరించిందని చెప్పాలి. దీనితో పార్టీ అధిష్టానం కూడా వంగవీటి రాధ విషయంలో సానుకూలంగా ఉంది. గతంలో కంటే వంగవీటి రాధా ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో కాస్త సైలెంట్ గానే ఉంటున్నారు. పెద్దగా ఎక్కడా మాట్లాడే ప్రయత్నం కూడా ఆయన చేయటం లేదు. పెళ్లి తర్వాత కాస్త ఆరోగ్యంగా కూడా ఇబ్బందులు పడ్డారు. ఇక ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని పార్టీలో చాలామంది ఆశించారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో దీనిపై పెద్ద చర్చ జరిగింది.
ఇప్పుడు రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండటంతో కచ్చితంగా వంగవీటి రాధాకు సీటు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి, గత ఏడాది ఆయన పుట్టిన రోజు సందర్భంగా మంత్రి లోకేష్ కూడా వంగవీటి రాధకు హామీ ఇచ్చారు. ఇక కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా వంగవీటి రాధ పేరు ప్రధానంగా వినపడింది. కానీ కొన్ని కారణాలతో ఆయనను ఎమ్మెల్సీ గా ఎంపిక చేసేందుకు పార్టీ అధిష్టానం ఆసక్తి చూపించింది. ఇక ఆయనకు మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. 2004లో చివరిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధా ఆ తర్వాత మళ్లీ చట్టసభల్లో అడుగుపెట్టలేదు. ఇప్పుడైనా వంగవీటి వారసుడికి అవకాశం దొరుకుతుందని వంగవీటి అభిమానులు ఆశిస్తున్నారు.













