Vangaveeti: వంగవీటి వారసుడి పయనం ఎటు…?
ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికల సందడి ముగిసింది. దీనితో సీటు ఆశించిన వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మరోసారి చర్చనీయాంశం అయింది. 2024 ఎన్నికల్లో సీటు వదులుకున్న వాళ్ళు.. అలాగే సైలెంట్ గా ఉన్న వాళ్ళ విషయంలో కూటమి పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటాయి… అనేదానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. టిడిపి(TDP) ముఖ్యంగా ఈ చర్చల్లో కీలకంగా ఉంది. టిడిపిలో కొంతమంది కీలక నాయకులు 2024 ఎన్నికల్లో సీటు వదులుకున్నారు.
వారిలో దేవినేని ఉమా(Devineni Uma), వంగవీటి రాధా, పిఠాపురం నియోజకవర్గం నుంచి వర్మ కీలక వ్యక్తులు. వీళ్లకు కార్పొరేషన్ పదవులు కూడా రాలేదు. దీనితో ఎమ్మెల్సీ స్థానాలు కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది ఆశించారు. కానీ నిరాశ ఎదురయింది. దేవినేని ఉమ, వర్మ సైలెంట్ గానే ఉన్నా.. వంగవీటి రాధ విషయంలోనే ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల రంగ, రాధా మిత్రమండలితో సమావేశమైన సమయంలో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారనే వార్తలు బయటకు వచ్చాయి.
తన సన్నిహితులతో కూడా ఇదే అంశంపై ఆయన మాట్లాడారని.. అయితే కొంతమంది సన్నిహితులు వేచి చూడాలని వారించారని అంటున్నారు. గత ఏడాది రాధ పుట్టినరోజు సందర్భంగా టిడిపి అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని హామీ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. పలువురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడంతో కచ్చితంగా ఆ స్థానం నుంచి వంగవీటి రాధ.. మండలి లో అడుగుపెట్టే అవకాశం ఉందని భావించారు. కానీ ఇప్పటివరకు ఆయన అడుగు పెట్టలేదు.
ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఒక స్థానాన్ని ఆయనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అందులో కూడా నిరాశ ఎదురయింది. దీనితో వంగవీటి రాధ ఏం చేయబోతున్నారనేది.. ఇప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లాలో హాట్ టాపిక్. రాధ విషయంలో టిడిపి అధిష్టానం సానుకూలంగానే ఉంది. దీనితో త్వరలోనే ఆయనకు ఏదో ఒక పదవి దక్కే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక వంగవీటి రాధ.. మంత్రివర్గంలోకి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ ఖాళీ ఉన్న ఓ మంత్రి పదవి విషయంలో జనసేన నుంచి నాగబాబుని ఎంపిక చేశారు. త్వరలోనే ఆయనను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.













