ఏపీలో మద్యం మాఫియాపై ఉక్కుపాదం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్య నిషేధం దిశగా తీసుకుంటున్న చర్యలు మద్యం మాఫియా విస్తరించడానికి కారణమవుతున్న నేపధ్యంలో్ మద్యం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సత్తా చాటుతోందని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వెల్లడించారు. ఎస్ఈబీ ఏర్పాటుతో రెణ్నెళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోన్న దాడులకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజాల్ ఎస్ఈబీ కమిషనర్ గా రాష్ట్రంలో యువ ఐపీఎస్ లు కదనరంగంలో దూసుకుపోతున్నారని ఆయన ప్రశంశించారు. మద్యానికి సంబంధించి అక్రమాలు ఎక్కడ కనిపించినా ఎస్ఈబీ అధికారులు కొరఢా ఝళిపిస్తున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో మద్య నిషేధం దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని ఎస్ఈబీ ఎక్కడికక్కడ అడ్డుకుంటోందన్నారు.
రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే మద్యవిమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేసే తరుణంలో రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయాన్ని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసినట్లు తెలిపారు. అక్రమ మద్యం ప్రవాహంలా ముంచెత్తే ప్రమాదం ఉందని.. అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా తలెత్తి తీరుతాయనే నిర్ణయానికి వచ్చిందన్నారు. అక్రమ మద్యం విక్రయాన్ని నిరోధించడం, అక్రమ మద్యం తయారీని అరికట్టడానికి విప్లవాత్మక చర్యలను ప్రభుత్వం తీసుకుందని తెలియజేశారు. అందులో భాగంగానే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) పేరుతో ప్రభుత్వం కొత్త శాఖను సృష్టించిందని వివరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దులను దాటుకుని రాష్ట్రంలోనికి ప్రవేశించే అక్రమ మద్యాన్ని నిరోధించడం.. రాష్ట్రం లోపల అక్రమ మద్యం తయారీని అణచివేయడం, అక్రమ మద్యం తయారీదారులపై ఉక్కు పాదాన్ని మోపడం వంటి చర్యలను ఈ కొత్తశాఖకు అప్పగించినట్లు తెలిపారు. అక్రమ మద్యం తయారీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ఆకస్మిక దాడులను నిర్వహించడం, ఎఫ్ఐఆర్ ను నమోదు చేయడం, నిందితులను న్యాయస్థానంలో ప్రవేశ పెట్టడం, కేసు దర్యాప్తు, ఛార్జిషీట్లను రూపొందించడం, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేసే అధికారాలను సైతం ప్రభుత్వం ఈ కొత్త శాఖకు బదలాయించినట్టు వివరించారు. సాధారణ పోలీసులకు వర్తించే అన్ని అధికారాలనూ దీనికి కట్టబెట్టిందని లక్ష్మణరెడ్డి తెలిపారు.
ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్ల పర్యవేక్షణలో ఎస్ఈబీ బాధ్యులైన యువ ఐపీఎస్ లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారని.. రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలతో అక్రమ రవాణాకు ఎస్ఈబీ అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకుగాను సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతమైన రీతిలో వినియోగిస్తున్నారని కితాబిచ్చారు. రాత్రివేళ గస్తీని ముమ్మరం చేస్తూ.. ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపుదాడులు చేయడం, సీసీ కెమెరాలు, మొబైల్ చెక్ పోస్టులతో పాటు ఇన్ఫార్మర్ల వ్యవస్థ కూడా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. రెండు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మద్యం తరలిస్తున్న, తయారుచేస్తున్న వేలాది మందిని అరెస్టు చేసినట్లు గణాంకాలతో సహా ఆయన వెల్లడించారు.













