Vallabhaneni Vamsi: రాజకీయాలకు వల్లభనేని గుడ్ బై..?

గన్నవరం(Gannavaram) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. 2024 లో ఓడిపోయిన తర్వాత వల్లభనేని వంశీ వ్యక్తిగతంగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా.. ఆయనపై పలు కేసులు నమోదు కావడం, మరికొన్ని కేసులు ఆయన ఇబ్బంది పెట్టేందుకు సిద్ధంగా ఉండటంతో వంశీ ఇక రాజకీయాలకు దూరం కావాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వంశీ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో పెద్దగా పర్యటించలేదు.
ఆ తర్వాత కేసులు కారణంగా జైల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన భార్య పంకజ శ్రీని, నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించాలని, వైసీపీ అధినేత వైయస్ జగన్(Ys jagan) నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంశీ రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు సుముఖంగా లేరని, అనారోగ్య సమస్యలు సైతం ఆయనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని సన్నిహితులు అంటున్నారు. అటు గన్నవరం నాయకులు నుంచి కూడా వంశీకి పెద్దగా సహకారం లేదని సమాచారం.
జైలు నుంచి విడుదలైన తర్వాత, వంశీ గన్నవరం సమీపంలోనే ఉంటున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన 35 కిలోమీటర్లు దాటి వెళ్ళకూడదు. దీనితో గన్నవరం సమీపంలోని సన్నిహితులు ఇళ్లల్లో వంశీ ఉంటున్నట్లు తెలిసింది. ఆ సమయంలో కూడా గన్నవరం వైసీపీ నాయకులు ఎవరు ఆయన వద్దకు వెళ్లి, పరామర్శించిన పరిస్థితి లేదు. దానికి తోడు కార్యకర్తలు కూడా పెద్దగా వంశీ కోసం ముందుకు రావడం లేదు. గతంలో ఆయన కోసం తిరిగిన వాళ్లు కూడా ఇప్పుడు దూరం కావడం, వంశీని మరింత ఇబ్బంది పెడుతోంది.
ఇక మరికొన్ని కబ్జా కేసులు కూడా బయటకు తీసే పనిలో పోలీసులు పడ్డారు. అటు రెవిన్యూ శాఖ కూడా కొన్ని అక్రమాలపై దృష్టి సారించింది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ముందుకు వెళ్లడం కష్టమని భావిస్తున్న వంశీ, ఇక త్వరలోనే.. తన నిర్ణయాన్ని పార్టీ అధినేతకు చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక నియోజకవర్గంలో వైసీపీకి వంశీ మినహా మరో ఆప్షన్ కూడా పెద్దగా కనపడటం లేదనే చెప్పాలి. మరి దీనిపై జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.