Vallabhaneni Vamsi: విడుదలైన వెంటనే జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన వల్లభనేని వంశీ
గన్నవరం (Gannavaram) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi Mohan) భార్య పంకజశ్రీ తో పాటుగా గురువారం తాడేపల్లి (Tadepalli) లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ను కలిశారు. విజయవాడ (Vijayawada) జైలులో సుదీర్ఘ కాలంగా రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ బుధవారం విడుదలయ్యారు. విడుదలైన వెంటనే ఆయన తనకు మద్దతుగా నిలిచిన జగన్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు.
వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యంగా సంభాషణ జరిగింది. పార్టీ తరపున తనకిచ్చిన మద్దతు ఎప్పటికీ మరువలేనిదని వంశీ జగన్‌కు వివరించారు. గతంలో వంశీ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో పార్టీ తరఫున వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత జైల్లోకి వెళ్లి ములాఖత్ లో జగన్ భరోసా ఇచ్చారు. అప్పట్లో పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఫిబ్రవరిలో కిడ్నాప్ కేసుతో వంశీ అరెస్టు అయ్యారు. ఆ తర్వాత వరుసగా కేసులు నమోదవడంతో ఆయన సుమారు 140 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. మొత్తం 11 కేసులు నమోదవడం వల్ల ఆయన న్యాయపరంగా దీర్ఘకాలం పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు అన్ని కేసులలో బెయిలు లభించి విడుదలయ్యారు. మైనింగ్‌కు సంబంధించిన కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిలుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేసినా, స్టే ఇవ్వకపోవడంతో వంశీ బెయిల్ పై బయటకు రాగలిగారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు జైలు వద్దకు వచ్చినా వారితో పెద్దగా మాట్లాడకుండా విడుదల అయిన వెంటనే ఆయన భార్య పంకజశ్రీతో కలిసి ఇంటికి వెళ్లిపోయారు. ఒక రోజు విశ్రాంతి తీసుకున్న తర్వాత, తాడేపల్లి చేరుకుని పార్టీ అధినేతను కలవడం జరిగింది. వంశీ అరెస్ట్ అయిన సమయంలో ఆయన భార్య పంకజశ్రీకి గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి పార్టీ తన మద్దతును చాటింది. ఇప్పుడు జగన్‌ను కలవడం ద్వారా వంశీ తన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. జగన్ కూడా వంశీని ఆప్యాయంగా పలకరించి, భవిష్యత్తులో మరింత బలంగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.













