తిరుమల తరహాలో అయోధ్యలో!
తిరుమల తరహాలో అయోధ్యలో భద్రతా చర్యలు చేపట్టేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు అధ్యయనం చేశారు. తిరుపతి పద్మావతి అతిథిగృహంలో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, టీటీడీ సీవీఎస్వో గోపినాథ్ జెట్టితో ఉత్తర్‌ప్రదేశ్ డీఐజీలు సుభాష్ చంద్ర దూబే, వినోద్ కె.సింగ్‌తో పాటు ఐపీఎస్ అధికారులు సమీక్షించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ అన్ని రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. తిరుమలకు వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అనుమతిస్తామని పేర్కొన్నారు. అనంతరం సీవీఎస్వో గోపీ నాథ్ జెట్టి మాట్లాడుతూ శ్రీవారి దర్శన క్యూలైన్ల నిర్వహణలో ఎలాంటి తోపులాటలు లేకుండా రద్దీకి తగ్గట్లుగా సమయం కేటాయించి అనుమతిస్తామని తెలిపారు. అవసరమైన ఆహార పదార్థాలు షెడ్లలో అందజేస్తామన్నారు. ఆలయంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్‌వాచ్‌లు అనుమతించమని స్పష్టం చేశారు. భద్రతాపరంగా ప్రతి విభాగానికి ఓ అధికారిని నియమించి పర్యవేక్షిస్తామని వివరించారు.













