సీఎం జగన్ తో అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మెన్ భేటీ
వైద్య, ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కొవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలిపారని అమెరికా కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జోయల్ రీఫ్‌మెన్ కొనియాడారు. విద్యా విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలనూ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రీఫ్‌మెన్ తన ఫేర్వెల్ విజిట్‌లో భాగంగా మర్యాదపూర్వకంగా కలిశారు. అమెరికా`ఆంధ్రప్రదేశ్ సంబంధాలు మెరుగుపర్చే విషయంలో అమెరికా కాన్సులేట్‌కు సీఎం ఇచ్చిన సహకారం, చొరవకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా కాన్సులేట్‌కు మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడడంలో సీఎం కృషిని కొనియాడారు. ఇక రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మొచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్-అమెరికా మధ్య పెట్టుబడులు, పరిశ్రమలు మరింత మెరుగుపడతాయని ఆకాంక్షించారు.
విశాఖపట్నంలో అమెరికన్ కార్నర్‌ను ప్రారంభించే విషయంలో యూఎస్ కాన్సుల్ జనరల్‌కు సీఎం జగన్ అందించిన సహాయానికి రీఫ్‌మెన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన మూడేళ్ల పదవీకాలంలో నాలుగుసార్లు సీఎం ను కలిసి వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఇవ్వడాన్ని బట్టి ఆంధ్ర, అమెరికా సత్సంబంధాల విషయంలో సీఎం జగన్ తీసుకున్న ప్రత్యేక చొరవను ఆయన అభినందించారు.













