సీఎం జగన్‌తో అమెరికన్ కాన్సులేట్ జనరల్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అనేక పాలనా సంస్కరణలపై హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్మాన్ ప్రశంసలు కురిపించారు. కాన్సులేట్ జనరల్‌గా బాద్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాలతో పాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. అవినీతి రహిత, పారదర్శక, సుపరిపాలనలో భాగంగా తీసుకొచ్చిన విధానాల గురించి రిఫ్మాన్కు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఆమేరకు తగిన కృషి చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.













