ఏపీకి అత్యాధునిక డ్రోన్ సేవలను అందిస్తాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే అత్యాధునిక డ్రోన్ సేవలను రాష్ట్రానికి అందిస్తామని అమెరికాకు చెందిన ఓ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు పరిశ్రమల శాఖ అధికారులతో భేటీ అయ్యారు. 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగిన అత్రి, ఇ-పాశుపత అనే రెండు రకాల అత్యాధునిక డ్రోన్ కెమెరాలను సచివాలయంలో ప్రదర్శనకు ఉంచారు. పరిశ్రమల శాఖ అధికారుల భేటీలో వారు మాట్లాడుతూ ఆకాశంలో మూడున్నర కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణం చేస్తూ ఒక స్థానం నుంచి 100 కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి ఆ 100 కిలోమీటర్లు వెనక్కి రాగల సామర్థ్యం ఈ డ్రోన్లకు ఉందని వివరించారు. వీటిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టు ర్న్వేలపై త్వరలో పరీక్షిస్తామన్నారు. ఈ డ్రోన్ల ద్వారా అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల జాడలు, అసాంఘిక కార్యకలాపాల సమాచారం తెలుసుకోవచ్చని, నిఘా వ్యవస్థ బలోపేతంతో పాటు పంటల పరిస్థితి తెలుసుకోవడం, క్రిమి సంహాకర మందులు చల్లకొనే అవకాశం కూడా ఉందన్నారు. వంద కిలోమీటర్ల దూరంలో ఎక్కడికైనా అత్యవసర ప్రాతిపదికన ముందులు సకాలంలో అందించవచ్చన్నారు.













