సీఎం జగన్ ఫోటో వేసి …మోదీది ఎందుకు వేయలేదు ? : కేంద్ర మంత్రి
ఆరోగ్యశ్రీ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అధికారులను ప్రశ్నించారు. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిని కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ నుంచి నిధులు విడుదల చేస్తోందని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులున్న వారికి అందిస్తోన్న వైద్య సేవలపై ప్రత్యేకంగా వివరాలు నమోదు చేస్తున్నారా? అని అధికారులను ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ కార్డులపై ముఖ్యమంత్రి జగన్ ఫొటో మినహా ప్రధాన ఫొటో లేకపోవడంతో ఈ పథకానికి నిధులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం అనే విషయం తెలుసా? అని నిలదీశారు.













