ఏపీ చరిత్రలో ఇదో స్వర్ణయగం
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత చేసినా ఏపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి క్రెడిట్ ఇవ్వడం లేదని బీజేపీ నేత, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, నాలుగున్నరేళ్లలో మోదీ సర్కార్ ఏపీకి ఎంతో చేసిందన్నారు. ఏపీకి కేంద్రం చేసిన సహాయం గురించి ఆయన వివరించారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 100 శాతం నిధులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో జాతీయ రహదారులు పెద్ద ఎత్తున విస్తరించామన్నారు. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైమే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పోర్టుల కోసం రూ.1.64 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఏపీ చరిత్రలో ఇదో స్వర్ణయుగమని నితిన్ అభివర్ణించారు.













