ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రధానమంత్రి జన్మాన్ వసతిగృహానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరావు అచ్చెన్నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఏ మంజూరుకు, వెనుకబడిన ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధి చేసేందుకు ఐటీఐ కళాశాలను మంజూరు చేస్తామని తెలిపారు. పాతపట్నం సామాజిక ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు.













