ఏపీకి ఇస్తే …మహారాష్ట్ర కూడా అడుగుతుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కూడా అడుగుతాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రధానమంత్రికి ఎలాంటి వివక్ష లేదని అన్నారు. అందుకే ప్రత్యేక హోదా కాకుండా, దానితో సమానంగా ప్రయోజనాలు ఏపీకి దక్కేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని తెలిపారు. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పడినా ఎవరికీ హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి నుంచి బయటకు వెళ్లిపోయిందని విమర్శించారు.
అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో మోదీ ఇచ్చిన హామీని విస్మరిస్తారా? అని మీడియా నిలదీయగా హోదా ఇవ్వకున్న హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కల్పిస్తామని సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు సాయం అందించే విషయంలో కేంద్రం ఏనాడు వెనకడుగు వేయలేదన్నారు. రూ.350 కోట్లు ఏపీ ఖాతాలో వేసి వెనక్కి తీసుకోవడంపై మీడియా నిలదీసింది. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కేంద్ర కారణం కాదని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించారు. వినియోగ పత్రాలపై టీడీపీ నేతలు మాట్లాడినప్పుడు అమిత్ షా సమాధానం చెబితే తప్పేంటమని ఆయన ప్రశ్నించారు.













