చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడి వివరాలు, ఇతరత్రా అంశాలపై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు. అదే సమయంలో కశ్మీర్ పర్యటన, వరుస కార్యక్రమాల కారణంగా అమిత్ షా సమయం ఇవ్వలేకపోయారు. కశ్మీర్ పర్యటన నుంచి తిరిగొచ్చిన అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై అమిత్ షాతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని ఈ సందర్భంగా రాష్ట్ర పరిణామాలను చంద్రబాబు అమిత్‌షాకు వివరించినట్లు సమాచారం. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు పోరాడుతుంటే వైకాపా దాడులకు తెగపడటంతో పాటు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తోందని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే ఏపీలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా.. దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా దాని మూలాలు ఏపీకి రావడం, ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు వచ్చాయని వివరించారు. అదే విధంగా తాము రాష్ట్రపతికి అందించిన వినతిపత్రం, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో, వీడియోతో సహా పంపుతానని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.













