ప్రత్యేక హోదాపై కేంద్రం క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఏ మేరకు అమలు చేశారో కేంద్రం స్పష్టం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్నాయుడు లోక్సభలో ప్రశ్నించారు. ఈ అంశంపై అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ పునర్విహభజన చట్టంలోని అనేక అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకోవాల్సినవని సమాధానమిచ్చారు. అలాగే ప్రత్యేక హోదాపై ఎంపీ రామ్మోహన్ ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని పాత పాటే పాడారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం పునరుద్ఘాటించింది.
పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. మరికొన్ని విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే అంశాలని తెలిపారు. విభజన హామీల అమలుకు వివిధ శాఖలతో సమీక్ష చేస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల అధికారులతో 24 సమీక్ష సమావేశాలు జరిగాయన్నారు.













