ఆంధ్రులకు, దేశానికీ నిరాశే : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రజలను కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరచిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. నవ్యాంధ్రకు తొలి ఏడాది ఆర్థిక లోటు భర్తీ కింద రూ.16 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. గతంలో రూ.4 వేల కోట్లు ఇచ్చారు. మిగతా మొత్తం విషయం ఈ బడ్జెట్లో ప్రస్తావించకపోవడం విచారకరం. గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కలిపి కేవలం 13 కోట్లు కేటాయించారు. ఐఐటీ, నిట్, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, ఐజర్ తదితర విద్యాస్థంలకు పైసా ఇవ్వలేదు. అమరావతి, పోలవరం పనులు ఆగిపోయి నాలుగు నెలలైనా ఈ బడ్జెట్లో వాటికి కేటాయింపులు లేకపోవడం గర్హనీయం.
రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వ తొలి బడ్జెట్ దేశ ప్రజలకు కూడా నిరాశ కలిగించిందని తెలిపారు. వివిధ రంగాల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వలేదని, రైతులు, మహిళలు, యువతరం ఆశలను నెరవేర్చే దిశగా బడ్జెట్ లేదని విమర్శించారు. జీరో బేస్డ్ వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించాలనుకోవడం మంచి చర్యన్నారు. డిజిటల్ చెల్లింపులపై పన్ను ఎత్తివేత నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. గతంలో తాను సంబంధిత కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన సిఫారసుల్లో ఇదే కీలక అంశమని తెలిపారు.













