నంద్యాల ఉప ఎన్నిక.. సంచలన నిజాలు!
నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన నిజాలు బయటపెట్టారు. అధికార టీడీపీ ఏవిధంగా విజయం సాధించిందో రట్టు చేశారు. గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందని ఆధారాలతో సహా వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు ప్రతి డ్వాక్రా మహిళ బ్యాంకు ఖాతాలో రూ.4 వేలు చొప్పున జమ చేశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఆయన మీడియాకు చూపించారు. జూలై 17 నుంచి ప్రారంభించి నెల రోజుల్లో ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే డ్వాక్రా మహిళల ఖాతాల్లో ఈ నగదు వేశారని ఆయన తెలిపారు.
‘మిగతా ప్రాంతాల్లో కూడా డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులు వేశారేమో కనుక్కుందామని రాజమండ్రి, పాలకొల్లు బ్యాంకుల్లో పని చేస్తున్న నా మిత్రులకు ఫోన్ చేసి అడిగాను. నగర పాలక ఎన్నికలు జరిగిన కాకినాడలోనూ డ్వాక్రా ఖాతాల్లోనూ డబ్బులు వేయలేదని తేలింది. నాకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఒక్క నంద్యాలలోనే డ్వాక్రా మహిళల అకౌంట్లలో రూ.4 వేలు చొప్పున జమ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అంశం. సచ్ఛీలుడు, నీతినిజాయితీకి మారుపేరైన ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లాల’ని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు.













