జగన్ సర్కార్‌పై ‘ఉండవల్లి’ కౌంటర్…
వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటడంతోనేమో… మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తనదైన శైలిలో విమర్శల దాడి పెంచారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఎడా పెడా విమర్శల వర్షం కురిపించిన ఉండవల్లి వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కొంత కాలం ఆ ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తిగానే ఉన్నట్టు కనిపించారు. అయితే ప్రభుత్వానికి ఏడాది వయసు దాటిన తర్వాత ఇక ప్రభుత్వ చర్యల్ని చిత్రిక పట్టడం అవసరం అనుకున్నట్టున్నారు… కొంత గ్యాప్ తీసుకుని బుధవారం పెట్టిన ప్రెస్మీట్లో తన ఆప్తమిత్రుడు వైఎస్ఆర్ పుత్రుడి ప్రభుత్వాన్ని ప్రశ్నల పరంపర సంధించారు.
పలు అంశాలపై ఉండవల్లి ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన జగన్ మాస్క్ ధరించకపోవడాన్ని తప్పుపట్టడంతో మొదలుపెట్టి పలు అంశాలపై ఆయన నిశిత విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇళ్ల పట్టాల పంపిణీ గురించి మాట్లాడుతూ రాజమండ్రి పరిసరాల్లోని ‘ఆవ’ భూములను నిరుపేదలకు పంచడం నిష్ప్రయోజనమని ఇలాంటి పంపిణీలు విఫమయ్యాయంటూ సోదాహరణంగా చెప్పారు. 30 లక్షల ఇళ్లపట్టాలు పంచామనే రికార్డు చెప్పుకోవడం కోసం మాత్రమే ప్రభుత్వానికి పనికొస్తాయన్నారు. అలాగే ఆ భూములకు అనవసరంగా అధికరేట్లు పెట్టి కొంటున్నారన్నారు. ఇక ఇసుక సమస్య ఇప్పటికీ తీరలేదని, పుష్కలంగా నది, ఇసుక ఉండే రాజమండ్రిలోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా రాష్ట్రంలో ఇంకెలా ఉందో నని సందేహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్య నిషేధ పాలసీని కూడా ఆయన నిశితంగా తప్పుపట్టారు. మద్యం తాగడం వల్ల వచ్చే నష్టాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని అవగాహన తేవాల్సింది పోయి పనికిమాలిన బ్రాండ్లు అవి కూడా అధికరేట్లకు అమ్ముతూ నాటుసారా, మద్యం మాఫియాకి గేట్లు తెరుస్తున్నారన్నారు. మద్యం రేట్లు పెంచడం అనేది నిషేధానికి ఏ మాత్రం ఉపకరించబోదన్నారు.
రాష్ట్రంలో రాజకీయ అరెస్టులపై మాట్లాడుతూ… నెల్సన్ మండేలాను ఆదర్శంగా తీసుకుంటే వైఎస్ జగన్ తన ప్రత్యర్ధులను అణగదొక్కే ప్రయత్నం చేసి ఉండేవారు కాదన్నారు. ఎన్నికల కమిషనర్ అంశంలోనూ జగన్ సర్కార్ వైఖరిని ఉండవల్లి తప్పుబట్టారు. సర్కార్ కు వ్యతిరేకంగా తీర్పులిస్తున్న న్యాయవ్యవస్థపై వైసీపీ అభిమానులు వ్యాఖ్యలు చేయడం మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలను మనమే అగౌరవపరచడం సరైంది కాదన్నారు.
జగన్ సిఎం అయి ఏడాది దాటిన తర్వాత దూకుడు పెంచిన ఉండవల్లి తన మిత్రుడి కుమారుడిగా జగన్ తనకెప్పుడూ ఆప్తుడేనని అయితే ముఖ్యమంత్రిగా ఆయన తనకు చాలా దూరమని స్పష్టం చేశారు. గతంలో తాను చంద్రబాబును విమర్శించినప్పుడు జగన్ మనిషిగా కొందరు చిత్రించారని, అయితే తను ఎవరి మనిషినీ కాదని అప్పుడే చెప్పానన్నారు. ఇకపై కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటానని, చంద్రబాబు లాగే ఈ ముఖ్యమంత్రి కూడా తన వ్యాఖ్యలకు విలువ ఇవ్వరనే అనుకుంటున్నానన్నారు.













