అసెంబ్లీ ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లే : ఉండవల్లి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లే అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియూతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఘోర వైఫల్యం చెందారని విమర్శించారు. ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని ఆయన ఆక్షేపించారు. రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకొని మళ్లీ పెడతాం ఆనడం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ప్రతిపక్షం సలహాలు తీసుకుంటే ప్రభుత్వానికి పేరు వస్తుందన్నారు. చంద్రబాబునుద్దేశించి అగౌరవంగా మాట్లాడుతుంటే జగన్ ఏం చేస్తున్నారని? విమర్శించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటే అంత అవివేకం ఇంకోటి లేదన్నారు.
ఇసుక, మధ్యం పెట్రోల్, కరెంట్ ఇలా అన్ని ధరలు పెంచుకుంటూ పోయారని మండిపడ్డారు. అప్పులు పెరుగుతున్నాయి కానీ ఆస్తులు అసలేం ఏర్పడటం లేదన్నారు. ఉన్నన్నాళ్లు అప్పులపై నెట్టుకొచ్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని రోడ్డుపై పడేయడమే వైసీపీ ఉద్దేశం అన్నారు. ఇప్పటి వరకు చేసిన అప్పులు తీర్చడానికి కూడా మళ్లీ అప్పులు తెస్తామని చెప్పడం, దీని కోసం ఎఫ్ఆర్బీఎమ్ చట్టాన్ని ఇష్టారీతిన సవరించడం దుర్మార్గం అన్నారు. రావాల్సిన నిధులపై కేంద్రాన్ని అడగటానికి కేసులు భయం పట్టుకుందన్నారు. అఖిల భారత సర్వీసు అధికారులు సైతం ప్రస్తుత పరిస్థితిపై నిర్ఘాంత పోతున్నారు అని ఉండవల్లి అన్నారు.













