ఏపీ అంటే కేంద్రానికి అంత అలుసా? : ఉండవల్లి
రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాన్ని విభజించాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని విమర్శించారు. ఏపీ జరిగిన అన్యాయంపై ఎందుకు చర్చిండం లేదని ప్రశ్నించారు. చర్చ లేకుండా బిల్లు ఎలా ఆమోదిస్తారన్నారు. రాజధాని లేకుండా విభజన ఎలా చేస్తారని నిలదీశారు. ఇప్పటికై వైసీపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలపై పోరాడాలని సూచించారు. ఏపీ అంటే కేంద్రానికి అంత అలుసా? అని మండిపడ్డారు.
ప్రధాని మోదీ స్వయంగా చెప్పినా మనవాళ్ళకు నొప్పిలేదన్నారు. రాష్ట్ర విభజనపై నరేంద్ర మోదీ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. ప్రశ్నించే ప్రాంతీయ పార్టీల నేతలపై బీజేపీ కేసులు పెడుతోందన్నారు. రాబోయే రోజుల్లో ఏపీని అసలు పట్టించుకోరని అన్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే విద్యుత్ కోతలు ఇలా ఉంటే వచ్చే మూడు నెలల్లో పరిస్థితి ఏమిటో తెలియడం లేదన్నారు. జగన్ కేంద్రానికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదని అన్నారు.













