తెలంగాణ ఫలితం ..ఆంధ్రా ఎన్నికలపై ఉంటుంది.. ఉండవల్లి వైరల్ స్టేట్మెంట్
ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం హీట్ ఎక్కడంతో పాటు పలు రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలతో వచ్చే రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నాయి .ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల సమరానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ ఇంచార్జ్ లను మార్చుతున్న విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితి రీత్యా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న తాజా ఎన్నికల నిర్ణయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలోకి ఎవరు త్యాగం చేయడానికి రారు.. సీటు లేదు అని చెప్పడానికి చాలా అనుభవం కావాలి.. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి అంత అనుభవం ఉంది అని నేను అనుకోవడం లేదు. టికెట్లు మార్చకపోతే తెలంగాణలో కేసీఆర్ దెబ్బతిన్నాడు కాబట్టి ఆంధ్రాలో మార్చాలి అనుకోవడం సరికాదు అని ఉండవల్లి అన్నారు.
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో మంచి ఎమ్మెల్యేలకు ఎక్కడ అధికారం లేదని.. ఒకరకంగా అధికారం మొత్తం జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ,మిగిలింది కాస్త కూస్తో వాలంటీర్ల చేతుల్లో మాత్రమే ఉందని ఉండవల్లి ఆరోపించారు. ఇలా అప్పులు చేసి మరి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచే గొప్ప ప్రయోగం కేవలం జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమవుతుందని.. ఇటువంటిది తాను ఇంతవరకు ఎక్కడా చూడలేదని ఉండవల్లి అన్నారు. రాజశేఖర్ రెడ్డి గురించి గొప్పగా చెప్పుకుని వైయస్సార్ పార్టీ.. ఆయనకు ఎంతో అభిమానం ఉన్న నెహ్రూ గురించి పార్లమెంట్లో విజయ్ సాయి రెడ్డి తప్పు పట్టినప్పుడు ఏం చేస్తున్నారు అని ఉండవెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక జెడి లక్ష్మీనారాయణ నూతన పార్టీ గురించి మాట్లాడుతూ.. జెడి పార్టీ సీట్లు సాధించలేకపోవచ్చు కానీ ఓట్లు పరంగా ఎంతవరకు సాధిస్తుంది అనేది రాజకీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది అని ఉండవల్లి అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు తో కలవడం కచ్చితంగా ఆ పార్టీకి బలాన్ని చేకూరుస్తుంది అని అన్నారు. ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని.. తెలంగాణ ఎన్నికల ప్రభావం కచ్చితంగా ఏపీ ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది అని ఉండవల్లి పేర్కొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో చక్కగా పద్ధతి ప్రకారం జరుగుతున్నాయని.. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి లేదని ఉండవల్లి అన్నారు.













