జగన్ పై సంచలనం సృష్టిస్తున్న ఉండవల్లి కామెంట్స్
ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుగు వాళ్లకు సుపరిచితమైన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన.. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలోనూ లేరు. అయితే ప్రజాసమస్యలపై అప్పుడప్పుడూ తన గళం వినిపిస్తుంటారు. ఉండవల్లి ఏ సమస్య లేవనెత్తినా దాని పూర్వాపరాలను పూసగుచ్చినట్లు చెప్పడం ఆయన ప్రత్యేకత. ఏ అంశంపైనైనా తన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లగలగడం ఆయన స్పెషాలిటీ. ఆయన చెప్తే జనమంతా నిజమేనేమో.. అని నమ్మేస్తుంటారు. అందుకే ఉండవల్లి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్ విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిస్తున్నారు. ఇటీవల స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణతో కలిసి ఐక్య కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఉండవల్లి కూడా ఐక్య కార్యాచరణతో ముందుకెళ్లినప్పుడే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలమని చెప్తున్నారు. ఇప్పటికే ఓ దఫా వీళ్లు ముగ్గురూ కలిసి ఎలా ముందుకెళ్లాలనేదానిపై చర్చించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం ప్రెస్ మీట్ పెట్టారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎన్ని ఉద్యమాలు చేసినా.. ఏ స్థాయిలో చేసినా కేంద్రం వైఖరిలో మార్పు ఉండకపోవచ్చని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. కార్మికుల ప్రయోజనాలకంటే పెట్టుబడిదారుల ప్రయోజనాలే కేంద్రానికి ముఖ్యమని.. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మాలని సీఎం జగన్ లేఖ రాశారని.. అయినా కేంద్రం ఆ పని చేయదని ఉండవల్లి తేల్చిచెప్పారు. రాష్ట్రాల చేతిలో ఏమీ లేకుండా లాక్కోవడానికే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమాలు పరిష్కారం చూపవన్న ఆయన.. కేవలం రాజకీయ పోరాటం ద్వారానే దీన్ని కాపాడుకోగలమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ, అమిత్ షాలకు భయపడి జగన్ వెనక్కు వెళ్తారా.. లేదా.. అనేది తెలియాల్సి ఉందన్నారు. వాళ్లను ప్రశ్నిస్తే జగన్ ను జైల్లో వేస్తారని భయపడుతున్నారా అని ఉండవల్లి ప్రశ్నించారు. జైలుకెళ్లడం కొత్త కాదు కదా.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆ పని చేయలేరా.. అని సూచించారు. ఉండవల్లి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉండవల్లి మతిభ్రమించి మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.













