Undavalli – Jagan: 2029 ఎన్నికల్లో జగన్ పరిస్థితిపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై (AP Politics) మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో (2029 Elections) తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన పార్టీ (JSP) కలిసి పోటీ చేస్తే 50 శాతానికి పైగా ఓట్లు సాధిస్తాయన్నారు. 145 నుంచి 155 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలోకి రావడం అసాధ్యమని ఉండవల్లి తేల్చి చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan) ఉన్న 22 ఈడీ, సీబీఐ కేసుల్లో శిక్ష పడితే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసుల్లో జగన్ డిస్ క్వాలిఫై అయితే దాదాపు పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేకుండా పోతాయన్నారు.
ఉండవల్లి ఏది మాట్లాడినా లాజికల్ గా మాట్లాడతారు. గాలి కబుర్లు చెప్పరు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఆసక్తి రేపుతున్నాయి. 2019 ఎన్నికల్లో (2019 Elections) వైసీపీ అధినేత వైఎస్ జగన్ 151 సీట్లతో ఘన విజయం సాధించారు. టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి (NDA) 164 సీట్లతో భారీ విజయం సాధించగా, వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమై ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ 135 సీట్లు, జనసేన 21 సీట్లు, బీజేపీ 8 సీట్లు గెలుచుకున్నాయి. ఈ ఫలితాలు జగన్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్టు తేల్చాయి.
2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 45.57 శాతం ఓట్లు సాధించగా, వైసీపీ ఓట్ షేర్ 39.45 శాతానికి పడిపోయింది. ఉండవల్లి అరుణ్ కుమార్ అంచనా ప్రకారం 2029లో టీడీపీ-జనసేన కూటమి 50 శాతానికి పైగా ఓట్లు సాధిస్తే, 175 సీట్లలో కనీసం 145 నుంచి 155 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. 2024లో ఈ కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నాయకత్వంలో జనసేన పార్టీ (Janasena) కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం (Kapu Community) ఓట్లను ఏకీకృతం చేయడంలో జనసేన విజయవంతమైంది. ఈ నేపథ్యంలో 2029లో కూడా ఈ కూటమి కొనసాగితే, వైసీపీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందనేది ఉండవల్లి అంచనా.
జగన్ మోహన్ రెడ్డిపై 2012 నుండి సీబీఐ, ఈడీ కేసులు నమోదై ఉన్నాయి. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమంగా ఆస్తులు సమకూర్చుకున్నారని, వివిధ సంస్థలకు ప్రయోజనాలు కల్పించి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. 2012లో జగన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికీ ఈ కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఉండవల్లి చెప్పినట్లు ఈ కేసుల్లో శిక్ష పడితే జగన్ డిస్క్వాలిఫై (Jagan Disqualify) అయ్యే అవకాశం ఉంది. భారత ఎన్నికల చట్టం ప్రకారం, రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడిన వ్యక్తి ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. జగన్ కేసులు హైకోర్టు, సుప్రీంకోర్టులలో పదేళ్ల వరకూ సాగితే, 2029 ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది.
2029లో టీడీపీ-జనసేన కూటమి మరింత బలంగా ఉంటే, వైసీపీ మరింత దిగజారే అవకాశం ఉంది. అదనంగా, జగన్పై కేసులు తేలితే, పార్టీ నాయకత్వంలో సంక్షోభం తలెత్తే ప్రమాదం కూడా ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి సూపర్ సక్సెస్ అయింది. మరో 10-15 ఏళ్లపాటు కూటమి కొనసాగుతుందని ఆ పార్టీలు చెప్తున్నాయి. అదే సమయంలో జగన్పై కేసులు, రాజకీయ వ్యూహాలు, పార్టీల మధ్య కూటములు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అంశాలు. ఈ పరిస్థితుల్లో జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా సాగుతుంది, వైసీపీ ఎలా పుంజుకుంటుంది అనేది తెలియాలంటే 2029 ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.













