స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై హైకోర్టులో ఉండవల్లి పిటిషన్..!! ఏం జరగనుంది..??
స్కిల్ డెవలప్ మెంట్ కేసు మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందంటూ ఆయన్ను అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ. అయితే అసలు ఇందులో మోసమే జరగలేదని.. జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగానే చంద్రబాబును జైలుకు పంపించిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ కేసులో పస లేదని టీడీపీ, దాన్ని నిరూపించేందుకు జగన్ ప్రభుత్వం, సీఐడీ నానా తంటాలు పడుతున్నాయి. విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ లాంటి ప్రదేశాలకు వెళ్లి మరీ సీఐడీ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబును అరెస్టును సమర్థించుకుంటోంది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసును ఏపీ సీఐడీ హ్యాండిల్ చేస్తోంది. అయితే సీఐడీ తీరుపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు నేరమే జరగని ఈ కేసులో చంద్రబాబును అకారణంగా జైలుకు పంపించారని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకే ఈ కేసులో మొదట బెయిల్ కు అప్లై చేయకుండా కేసునే కొట్టేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ. ఇది ఇప్పుడు కోర్టులో ఉంది. అయితే ఈ స్కాం సూత్రధారి చంద్రబాబే అని.. ఆయన పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని సీఐడీ చెప్తోంది. ఆధారాలను తాము కోర్టుకు సమర్పిస్తామని స్పష్టం చేస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసును సీఐడీ నుంచి తప్పించి సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీబీఐ, ఈడీ, చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా మొత్తం 44 మందిని ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సీబీఐ లేదా ఈడీతో విచారణ జరిపిస్తేనే ఇందులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఉండవల్లి పిటిషన్ లో పేర్కొన్నారు. హైకోర్టు కూడా విచారణకు స్వీకరించడంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తి కలిగిస్తోంది.
మార్గదర్శి వ్యవహారంలో రామోజిరావు, శైలజా కిరణ్ లపై ఉండవల్లి పోరాటం చేస్తున్నారు. ఉండవల్లి పోరాటం వల్లే మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టి వాళ్లను విచారిస్తోంది. ఉండవల్లి ఏదైనా పట్టుకుంటే అంత ఈజీగా వదిలిపెట్టారు. స్వతహాగా లాయర్ అయిన ఉండవల్లి.. కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంటారు. ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయని భావిస్తున్న ఉండవల్లి సీబీఐ విచారణ కోరుతున్నారు. మరి ఉండవల్లి పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.













