Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా అనుమానాలా? తెర వెనుక ఏం జరుగుతోంది ?
పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen Pagadala) మృతి కేసు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మార్చి 25, 2025న రాజమహేంద్రవరం (Rajamahendravaram) సమీపంలోని కొంతమూరు వద్ద పాస్టర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, సీసీటీవీ (CCTV) ఫుటేజీలు, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ, కొంతమంది ఈ మరణాన్ని హత్యగా చిత్రీకరిస్తూ, మతాల మధ్య చిచ్చు రేపడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పాస్టర్ ప్రవీణ్ పగడాల, హైదరాబాద్‌కు చెందిన క్రైస్తవ సువార్తికుడిగా, మత బోధకుడిగా ప్రసిద్ధి చెందారు. మార్చి 24న ఆయన బైక్‌పై హైదరాబాద్ నుంచి బయలుదేరారు. రాజమహేంద్రవరం వైపు ప్రయాణిస్తూ, కొంతమూరు సమీపంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. స్థానికులు మరుసటి రోజు ఉదయం ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమికంగా పోలీసులు దీన్ని రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే, ఆయన శరీరంపై గాయాలు, రక్తపు మరకలు ఉండటంతో, కొంతమంది ఇది హత్య కావచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. సీఎం చంద్రబాబు,(CM Chandrababu) హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) స్పందించి, డీఎస్పీ స్థాయి అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు.
దర్యాప్తులో భాగంగా బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజీలు (CCTV footage) ఈ కేసుకు కొత్త కోణాన్ని ఇచ్చాయి. ప్రవీణ్ మార్చి 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, హైదరాబాద్ ఎల్.బి.నగర్ (L.B.Nagar) సమీపంలో మద్యం (Liquor) తీసుకున్నారు. అనంతరం కోదాడలో (Kodada) మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత విజయవాడ సమీపంలోని కంచికచర్ల (Kanchikacharla) వద్ద బైక్ నుంచి పడిపోయారు. రామవరప్పాడు రింగ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి, మద్యం మత్తులో బైక్ నడపవద్దని హెచ్చరించినప్పటికీ, ఆయన పట్టించుకోకుండా ప్రయాణం కొనసాగించారు. రాత్రి 11:30 గంటలకు కొంతమూరు టోల్గేట్ వద్ద కనిపించిన ఆయన, 11:42 గంటలకు నయారా పెట్రోల్ బంక్ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఆధారాలు దీన్ని ప్రమాదంగా సూచిస్తున్నప్పటికీ, కొంతమంది హత్య అనే వాదనను వదలట్లేదు.
ఈ వివాదంలో మతపరమైన కోణం కూడా తెరపైకి వచ్చింది. కొందరు క్రైస్తవ సంఘాల (Christian Associations) నాయకులు, రాజకీయ నేతలు ఈ ఘటనను మత ఘర్షణలతో ముడిపెడుతూ, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు, వైఎస్ షర్మిల, హర్షకుమార్ వంటి వారు దీన్ని పథకం ప్రకారం జరిగిన హత్యగా పేర్కొంటూ, కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు. అయితే, ఈ వాదనలు సీసీటీవీ ఆధారాలతో సరిపోలడం లేదని, రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శకులు అంటున్నారు. జనసేన నేతలు కూడా, ఈ ఘటనను అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.
పోలీసులు ఈ కేసును సున్నితంగా భావిస్తూ, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజమండ్రికి చెందిన నాగమల్లేష్ అనే వ్యక్తిని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు అరెస్టు చేశారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ప్రకారం, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుంది. అయితే, ఇప్పటివరకు బయటకు వచ్చిన ఆధారాలు ప్రమాదానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో హత్య అనే వాదనను ఇంకా కొనసాగించడం సమంజసమా అనే ప్రశ్న తలెత్తుతోంది. సీసీటీవీ ఫుటేజీలు, ప్రవీణ్ మద్యం సేవించిన విషయం, ట్రాఫిక్ పోలీసుల హెచ్చరికలను ధిక్కరించడం వంటివి దర్యాప్తులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, కొంతమంది దీన్ని మత విద్వేషంగా మార్చి, ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది సమాజంలో అశాంతిని రేకెత్తించే ప్రమాదం ఉంది. కాబట్టి, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కంటే, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఓపిక పట్టడం మంచిదని సూచిస్తున్నారు.













