ఈ నెల 6న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
శ్రీవారి ఆలయంలో ఈ నెల 6వ తేదీన శ్రీవికారినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. ఇందులో భాగంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవర్లను సర్వభూపాల వాహనంపై బంగారు వాకిలి వద్దకు వేంచేపుచేస్తారు. అలాగే విష్వక్సేనుడినీ మరోపీఠంపై ఆశీసులు చేస్తారు. అనంతరం ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్దనున్న ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదిస్తారు. అన్ని కైంకర్యాలు పూర్తయ్యాక అక్షతారోపణ చేసి సిద్దాంతి ద్వారా పంచాంగ శ్రవణం పఠిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.













