Seize the Ship: రిలీజ్ ది షిప్ .. పవన్ కల్యాణ్‌కు కేంద్రం షాక్..!?
ఆంధ్రప్రదేశ్ (AP) లో ఇటీవల బాగా పాపులర్ అయిన డైలాగ్ ‘సీజ్ ది షిప్’. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Dy. CM Pawan Kalyan) కాకినాడ పోర్టులో (Kakinada Port) పర్యటించినప్పుడు పీడీఎస్ బియ్యాన్ని (PDS Rice) అక్రమంగా లోడ్ చేసిన షిప్ ను గుర్తించారు. వెంటనే సీజ్ ది షిప్ (Seize the ship) అంటూ సినిమాటిక్ గా అధికారులను ఆదేశించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనం కలిగించింది. తక్షణమే పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుని అక్రమ బియ్యం రవాణాకు అడ్డుకట్ట వేశారంటూ ఆయన అభిమానులు పొగుడుతూ వచ్చారు. అయితే ఇప్పుడీ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఇలా షిప్ ను సీజ్ చేయడం కుదరదని.. రిలీజ్ ది షిప్ (Release the ship) అని కేంద్రం నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం (Ration Rice) పెద్దఎత్తున విదేశాలకు తరలివెళ్తోందనే ఆరోపణలు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి. వైసీపీ (YSRCP) అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (Dwarampudi Chandra Sekhar Reddy) బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారని పవన్ కల్యాణ్ అప్పట్లోనే విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే నిజాలు నిగ్గు తేల్చుతామని స్పష్టం చేశారు. అన్నట్టుగానే అధికారంలోకి రాగానే కాకినాడ పోర్టు వ్యవహారాలపై పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) కు ప్రత్యక సూచనలు చేస్తూ బియ్యం రవాణాపై ఓ కన్నేసి ఉంచారు. గతంలోనే కాకుండా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బియ్యం తరలి వెళ్తున్నట్టు గుర్తించారు.
కాకినాడ పోర్టుకు బియ్యం తరలిస్తున్న గోడౌన్లపై మొదట నిఘా పెట్టారు. ఆ తర్వాత పోర్టులోకి వెళ్లి పరిశీలించారు. అక్కడ కూడా రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఈ క్రమంలో పోర్టులోకి వెళ్లి పరిశీలించేందుకు ప్రయత్నించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను అధికారులు అడ్డుకున్నారు. ఇది మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ పట్టుబట్టి షిప్ వరకూ వెళ్లారు. అక్కడి బియ్యాన్ని చూసి సీజ్ ది షిప్ అని ఆదేశాలిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్, పౌర సరఫరాల శాఖ అధికారులు ఆ బియ్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే షిప్ ను సీజ్ చేసేందుకు మాత్రం అధికారాలు లేవని గుర్తించారు.
మరోవైపు తమ షిప్ ను సీజ్ చేయడంపై నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు కాకినాడ పోర్టులో అక్రమాలను రాష్ట్ర అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాలన్నింటినీ పరిశీలించిన కేంద్రం.. షిప్ ను వదిలేయాలని.. బియ్యాన్ని మాత్రం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికా ఖండంలో ఆకలి తీర్చేందుకు మన ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆహారం సరఫరా చేస్తోంది. ఇలా షిప్ లను సీజ్ చేస్తే ఆ ఒప్పందాలకు విఘాతం కలిగించినట్లవుతుందని సూచించింది. అందుకే వెంటనే షిప్ ను రిలీజ్ చేయాలని స్పష్టం చేసింది. దీంతో పవన్ కల్యాణ్ డైలాగ్ ఇప్పుడు సెటైర్లకు అవకాశం కల్పిస్తోంది. అయినా బియ్యం అక్రమ రవాణా గుట్టు తేల్చడంతో మూలాలను అన్వేషించేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఈ తతంగం వెనకున్న పెద్ద తలకాయలు బయటికొస్తాయని భావిస్తున్నారు.













