ఏపీలో రెండు రోజులు సంతాప దినాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (50) హఠాన్మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. మేకపాటి కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు దిగ్బ్రాంతికి గురయ్యారు. గౌతమ్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సంతాపం ప్రకటించి నివాళులు అర్పించారు. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించింది. అమెరికాలో ఉన్న గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి వచ్చిన తర్వాత అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.













