టీటీడి బోర్డ్ చైర్మన్‌గా బిఆర్ నాయుడు నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా టీవీ5 గౌరవ ఛైర్మన్ బీఆర్ నాయుడును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు టీటీడీ బోర్డు చైర్మన్‌గా కొనసాగనున్నారు. టీవీ5, హిందూధర్మం ఛానెళ్ల వ్యవస్థాపకులుగా హిందూధార్మిక కార్యక్రమాల నిర్వహణలో బీఆర్ నాయుడు తనదైన ముద్ర వేశారు. టీటీడీ ఛైర్మన్‌తో కలిపి మొత్తం 24 మంది సభ్యుల పేర్లతో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాపారవేత్తగా..సామాజిక కార్యకర్తగా.. ఆధ్యాత్మికవేత్తగా సేవలు అందించిన బీఆర్ నాయుడుకు ప్రతిష్టాత్మకమైన టీటీడీ పదవిని అప్పగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. టీటీడీ నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తనను ఛైర్మన్‌గా నియమించినందుకు ఏపీ ప్రభుత్వానికి బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు బీఆర్ నాయుడు.
వెంకటేశ్వరస్వామి భక్తుడు బిఆర్ నాయుడు
మీడియా రంగంలో తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులన బిఆర్ నాయుడు స్వయంకృషి, పట్టుదల, ఆధ్యాత్మిక నిబద్దతకూ ప్రతీక. వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ స్పృహకలిగిన వ్యక్తిగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమించారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బిఆర్ నాయుడు స్వయంకృషితో ఎదిగారు. సాంకేతిక విద్యను అభ్యసించి హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగం నిర్వహించారు. బిహెచ్‌ఇఎల్ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. ఉద్యోగుల తరఫున సాహిత్య సాంస్కృతిక అంశాలపై ప్రత్యేక పక్ష పత్రికనూ నడిపారు. బిహెచ్‌ఇఎల్‌లో పనిచేస్తున్న సమయంలోనే ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో.. పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు. స్వతహాగా వెంకటేశ్వరస్వామి భక్తుడైన బీఆర్ నాయుడు ముందునుంచీ ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే విధంగా హిందు ధర్మ ప్రచార నిమిత్తం ‘‘హిందూ ధర్మం’’ పేరుతో 2018లో ఆధ్యాత్మిక ఛానల్ స్థాపించారు.
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పుణ్యక్షేత్రాల నుంచి జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివిధ క్షేత్రాల మహత్యాలు ప్రత్యేకంగా ప్రసారం చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను హిందూధర్మం ద్వారా యావత్ తెలుగు ప్రజలకు చేరువచేసే ప్రయత్నం బీఆర్ నాయుడు చేస్తున్నారు. దేవస్థాన ధార్మిక కార్యకలాపాలు, ఆగమ శాస్త్రాల ప్రాధాన్యత, హిందూ ధర్మ పరిరక్షణ, భక్తుల మనోభావాలు స్థానికుల అవసరాలు అన్నీ తెలిసిన వ్యక్తిగా టిటిడి బోర్డు చైర్మన్‌గా పూర్తి చిత్తశుద్ధితో బాధ్యత నిర్వహిస్తానని బిఆర్ నాయుడు అన్నారు. తన పదవీకాలంలో పూర్తి పారదర్శకత, ధార్మిక చిత్తశుద్ధితో వెంకటేశ్వర స్వామి సేవ చేసేందుకు కంకణబద్దుడై ఉన్నట్టు బిఆర్ నాయుడు ప్రకటించారు.
బోర్డు సభ్యులు
చైర్మన్ గా బీఆర్ నాయుడు, సభ్యులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎంపీ పనబాక లక్ష్మి, నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ), జాస్తి పూర్ణ సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, కృష్ణమూర్తి(తమిళనాడు), అక్కిన ముని కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, ఆర్‌ఎన్ దర్శన్(కర్నాటక), జస్టిస్ హెచ్‌ఎల్ దత్ (కర్నాటక), ఎం.శాంతారామ్, పీ.రామమూర్తి(తమిళనాడు) తమ్మిశెట్టి జానకీ దేవి, బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ), అనుగోలు రంగశ్రీ(తెలంగాణ), బూరగపు ఆనందసాయి(తెలంగాణ), సుచిత్ర ఎల్లా (తెలంగాణ), సరేష్ కుమార్(కర్నాటక). డాక్టర్ ఆదితి దేశాయ్(గుజరాత్), సౌరబ్ హెచ్ బోరా(మహారాష్ట్ర), జీ.భానుప్రకాష్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రభుత్వ రెవెన్యూ (దేవాదాయ) కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్, తుడా ఛైర్మన్, తితిదే కార్యనిర్వహణాధికారి ఉన్నారు. ఈ మేరకు రెవెన్యూ(దేవాదాయ)శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ ఉత్తర్వులు విడుదల చేశారు.