ఇచ్చేవాళ్లు, తీసుకునేవాళ్లకు లేని సమస్య.. ప్రభుత్వానికి ఎందుకు ?
వివిధ రాష్ట్రాల్లో మార్గదర్శి కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే సమస్య ఎందుకు వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్గదర్శి సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగడం దారుణమని అన్నారు. ప్రభుత్వ తప్పులను మీడియాలో ఎత్తిచూపితే మార్గదర్శిని వేధించడం జగన్ ప్రభుత్వ అరాచకానికి నిదర్శనమన్నారు. మార్గదర్శిపై ఒక్క ఫిర్యాదు లేకపోయినా ప్రభుత్వానికి అత్యుత్సాహం ఎందుకు అని ప్రశ్నించారు. ఆవు, దూడ బాగుంటే, మధ్యలో గుంజకు వచ్చింది గురకరోగమని ఒక సామెత ఉంది. ఇచ్చేవాళ్లు తీసుకునేవాళ్లకు లేని సమస్య ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? వైసీపీ ప్రభుత్వ తీరు వల్ల ఇప్పటికే అనేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగం కల్పించడం మానేసి, ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థలను వేధిస్తూ జగన్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు. తానా అంటే తందానా అన్నట్లుగా సీఐడీ అధికారులు కూడా రాజకీయ నాయకుల మాదిరిగా మాట్లాడటం మంచిది కాదు అని అన్నారు.













