ఆయన వైకుంఠం చూపిస్తే .. ఈయన కైలాసం : తులసిరెడ్డి
ఐదేళ్లు ప్రజలకు చంద్రబాబు వైకుంఠం చూపిస్తే, మూడు రాజధానుల పేరుతో జగన్ కైలాసం చూపిస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నిపుణుల కమిటీ రాకముందే రాజధానిపై జగన్ ఎందుకు ప్రకటన చేశారని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అమరావతిలోనే సచివాలయం ఉండాలన్నారు. విశాఖలో అసెంబ్లీ, శాసనమండలి ఏర్పాటు చేయాలన్నారు. కమిటీ నివేదిక వారంలో రానుందని, ఈలోగా జగన్ ప్రకటన చేయడం సరికాదని అన్నారు. కమిటీ రిపోర్ట్ వచ్చాక అసెంబ్లీ, పార్టీలు, ప్రజాసంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. సెక్రటేరియట్ ఇప్పటికే అయిపోయిందని కేంద్రం మ్యాప్‌లోనూ చూపించిందని అన్నారు. భవనాలు కూడా దాదాపు పూర్తయ్యాయన్నారు. సచివాలయం రాజధానికి గుండెలాంటిదని, అసెంబ్లీ, శాసన మండలి భవనాలను విశాఖలో పెడితే బాగుంటుందని తులసిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.













