టీటీడీ సంచలన నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. మహాసంప్రోక్షణ క్రతువు ఉన్నందున 9 రోజుల పాటు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఆగస్టు 17 ఉదయం 6 గంటల వరకు వెంకన్న దర్శనానికి భక్తులను అనుమతించకూడదని టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
తిరుమలలో 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాసంప్రోక్షణపై చర్చించేందుకు టీటీడీ పాలకమండలి భేటీ అయ్యింది. మహాసంప్రోక్షణ జరపాలన్న ఆగమ పండితుల సలహాకు అనుగుణంగా ఆగస్టు 12 నుంచి 16 వరకు అష్టబంధన, బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలను తిరుమల కొండపై నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 11న మహాసంప్రోక్షణకు అంకురార్పణ జరుగనుంది. ఆయా రోజుల్లో వైదిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండటం, భక్తులకు దర్శనం కల్పించేందుకు తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.













