టీటీడీ కొత్త విధానం.. ఇకపై ఆన్లైన్లోనే
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహించే ఆర్జిత సేవల లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఇకపై ఆన్లైన్లో నగదు చెల్లించి వాటిని తీసుకోవచ్చు. ఈ మేరకు టీటీడీ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు లక్కీడిప్ ద్వారా పొందిన ఆర్జిత సేవా టికెట్లను పొందిన భక్తులు తిరుమలలోని సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయానికి (సీఆర్ఓ) నేరుగా వెళ్లి కౌంటర్ వద్ద నగదు చెల్లించి టికెట్లు తీసుకోవాల్సి ఉండేది. ఇలా టికెట్లు పొందే ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై టీటీడీ స్పందించింది. ఇకపై ఈ విధానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన విధానాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నూతన విధానంలో పే లింక్ ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
మొదటగా భక్తులకు ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్‌ను టీటీడీ పంపిస్తుంది. భక్తులు ఈ లింక్‌పై క్లిక్ చేసి యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్లో నగదు చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సీఆర్ఓలోని లక్కీడిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. త్వరలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ తెలిపింది.













