టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా.. జవహర్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‍గా ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ప్రమాణం చేశారు. వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం శ్రీవారి ఆలయం బంగారు వాకిలి చెంత జరిగింది. ఈవో జవహర్ రెడ్డితో పాటు అదనపు ఈవో ధర్మారెడ్డి సైతం కన్వీనర్‍గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ హిందూ ధార్మిక ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పాలకమండలి నిర్ణయాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 21న టీటీడీ పాలకమండలి పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే.
దీంతో ప్రభుత్వం ఈఓను చైర్మన్‍గా స్పెసిఫైడ్ అధారిటీని ఏర్పాటు చేసింది. ఆంధప్రదేశ్ ఎండోమెంట్ చట్టం 1987లోని సెక్షన్ 137 ప్రకారం ప్రభుత్వం ఈఓ, అదనపు ఈవోలతో అథారిటీని ఏర్పాటు చేసింది. అథారిటీకి అన్ని అధికారాలు ఉంటాయని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ధర్మకర్తల మండలి నిర్వహించే అన్ని విధులను నిర్వహిస్తుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంతకు ముందే తెలిపారు.