TTD: ఏ రోజు దర్శించుకున్నా అదే ఫలితం :అనిల్ కుమార్ సింఘాల్
ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే పవిత్రమైన రోజులు. ఈ పది రోజుల్లో ఏ రోజు స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. భక్తులు ఆందోళనపడకుండా ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవాలి అని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) సూచించారు. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో ఆయన మాట్లాడారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు (Tokens) లేకుండా వచ్చేవారిలో 3.60 లక్షల మందికి సర్వ దర్శనాలు చేయించేలా ప్రణాళికలు సిద్ధంచేశాం. ఈ పది రోజుల్లో 7.70 లక్షల మంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ 6.60 లక్షల మందికి మించి వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోలేదు. ఈ ఏడాది లక్ష మందికి అదనంగా దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేశాం. భక్తులు కూడా రద్దీకి అనుగుణంగా తిరుమల (Tirumala) యాత్రను ప్లాన్ చేసుకుని రావాలి అని సూచించారు. టోకెన్లలోనే పేర్కొన్న సమయానికే తిరుమలకు రావాలని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. కేటాయించిన సమయానికే వస్తే గంట నుంచి రెండు గంటల్లోనే వైకుంఠ ద్వార దర్శనం (Vaikuntha Dwara Darshan) పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.






