Tirumala: శ్రీవారి మెట్ట మార్గంలో భక్తులకు … మెరుగైన సౌకర్యాలు : టీటీడీ ఈవో
తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు శ్రీవారి మెట్టు (Srivari Mettu) మార్గంలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో జె.శ్యామలరావు (J. Shyamala Rao) తెలిపారు. కాలినడకన వెళ్లే మార్గంలో టోకెన్లు పొందేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయం టీటీడీ దృష్టికి వచ్చిన నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి (Venkaiah Chowdhury) , జేఈవో వి.వీరబ్రహ్మం (Veerabrahamam) తో కలిసి కాలినడక మార్గంలో పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ శ్రీవారి మెట్టు మార్గంలో దర్శనానికి సంబంధించి టోకెన్లు పొందడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఆటోవాలాల నుంచి సరైన సహకారం లేదనే విషయం బోర్డు దృష్టికి వచ్చిందన్నారు. టీటీడీ కల్పిస్తోన్న సౌకర్యాలను ఆటోవాలాలు తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని, భక్తుల నుంచి విచ్చలవిడిగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై సమీక్షించి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు మార్గం వరకు బస్సుల సంఖ్య పెంచడం, టోకెన్ల జారీ కౌంటర్లను పెంచే అంశాలను పరిశీలిస్తామన్నారు. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని, అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.













