TTD: టీటీడీ ఈవోగా మళ్లీ అనిల్‌కుమార్ సింఘాల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కీలకమైన శాఖలు అప్పగించింది. కేంద్ర సర్వీసుల నుంచి తిరిగొచ్చి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అనిల్‌కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా నియమితులయ్యారు. ఆ స్థానంలో ఉన్న జె.శ్యామలరావు (J. Shyamala Rao)ను సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ-పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీచేసింది. ప్రస్తుతం అక్కడున్న ముకేశ్‌కుమార్ మీనా(Mukesh Kumar Meena) ను రెవెన్యూ (ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శిగా నియమించింది. అటవీ-పర్యావరణ శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న జి.అనంతరామును బదిలీచేసి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ (K. Vijayanand) ఉత్తర్వులు జారీ చేశారు. సింఘాల్ గతంలోనూ టీటీడీ ఈవోగా పనిచేశారు. చంద్రబాబు హయాంలో 2017 మే 6న ఈ బాధ్యతలు చేపట్టిన ఆయన, వైసీపీ ప్రభుత్వంలో 2020 అక్టోబరు 4 వరకు పనిచేశారు. ఐదేళ్ల తర్వాత రెండోసారి ఈ పదవిలో నియమితులు కావడం గమనార్హం.