హనుమ పుట్టింది అంజనాద్రిలోనే! తేల్చేసిన టీటీడీ
హనుమంతుడి జన్మస్థానంపై క్లారిటీ వచ్చేసింది. తిరుమలలోనే ఆంజనేయుడు పుట్టినట్లు టీటీడీ తేల్చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందుకు తగ్గ ఆధారాలను కూడా బుక్ లెట్ రూపంలో రిలీజ్ చేసింది. అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో హనుమంతుడు జన్మించినట్లు వెల్లడించింది. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు.
ఆంజనేయుడి జన్మస్థానంపై అన్వేషణకు టీటీడీ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలోని పండితులు, అధ్యయనకారులు పలుమార్లు సమావేశమై లోతుగా పరిశోధన చేశారు. చివరకు హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలను సేకరించారు. హనుమ జన్మస్థలంపై నాలుగు నెలల పాటు తమ కమిటీ అధ్యయనం సాగించినట్లు ఆచార్య మురళీధర శర్మ వెల్లడించారు.
హనుమంతుడి జన్మస్థానంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని సంకల్పించినట్లు మురళీధర శర్మ చెప్పారు. అందుకోసం శాసన, భౌగోళిక, పౌరాణిక, వాజ్ఞ్మయ ప్రమాణాలతో కూడిన అనేక ఆధారాలు సేకరించామన్నారు. వేంకటాచల మహత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నామని.. వేంకటాచలానికి అంజనాద్రితో పాటు 20 పేర్లు ఉన్నాయని చెప్పారు. త్రేతాయుగంలో దీన్ని అంజనాద్రిగా పిలిచేవారని.. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడని వివరించారు. సూర్యబింబం కోసం వెంకటగిరి నుంచే హనుమంతుడు ఎగిరాడని.. దాదాపు 12 పురాణాలు ఆంజనేయుడు తిరుమల కొండల్లోనే పుట్టాడని చెబుతున్నాయని మురళీధర శర్మ వెల్లడించారు.
తిరుమలలోని జాపాలీ తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని మురళీధర శర్మ ప్రకటించారు. హంపీలోని విజయనగరం అంజనాద్రి కాదని… వాలి ఏలిన కిష్కింద కాబట్టి వానర సైన్యం ఆనవాళ్లు అక్కడ ఉండొచ్చని వివరించారు. నాసిక్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర.. ఇవేవీ అంజనేయుడి జన్మస్థలాలు కావని స్పష్టం చేశారు. 12, 13 శతాబ్దం నాటి ఎన్నో రచనల్లో అంజనాద్రి ప్రస్తావన ఉందని.. అన్నమయ్య కీర్తనల్లో కూడా వేంకటాచలాన్ని అంజనాద్రిగా వర్ణించారని తెలిపారు.
హనుమంతుడి జన్మస్థానంపై అన్వేషణకు ఏర్పాటు చేసిన కమిటీలో మురళీధర శర్మతో పాటు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ్‌కుమార్ సభ్యులుగా ఉన్నారు. టీటీడీ ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా.ఆకెళ్ల విభీషణశర్మ కన్వీనర్‌గా వ్యవహరించారు. మొత్తానికి హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనని తేల్చేశారు.













