టీటీడీ క్యాలెండర్ ఆవిష్కరించిన చైర్మన్ వై.వీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి, అమ్మవార్ల చిత్రాలకు 3డి ఎఫెక్ట్ సిల్వర్ కోటింగ్‌తో ప్రత్యేకంగా రూపొందించిన 6 పేజీల క్యాలెండర్‌ను టీటీడీ చైర్మన్ వై.వీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక్షంగా వీక్షించిన, తాకిన అనుభూతి కలిగేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్యాలెండర్లను ముద్రించినట్టు తెలిపారు.
ఒక్కో పేజీలో రెండు నెలలకు సంబంధించిన వివరాలు ఉండేలా రూపొందించామని తెలిపారు. 25 వేల కాపీలు ముద్రించామని, ఒక్కో క్యాలెండర్ ధర రూ.450 అని వెల్లడించారు. తిరుమల, తిరుపతితో పాటు విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ లో భక్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, ఎఫ్ఏసీఏవోఓ. బాలాజీ, చీఫ్ అడిట్ ఆఫీసర్ శేషలైలేంద్ర, హెల్త్ అడ్వైజర్ డాక్టర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.













