రాజకీయ లబ్ధికోసమే కొందరు.. దానిపై ఆరోపణలు
దళారీ వ్యవస్థను రూపుమాపడానికి శ్రీవాణి ట్రస్ట్‌ను పునరుద్ధరించామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజకీయ లబ్దికోసమే కొందరు దానిపై ఆరోపణలు చేశారని విమర్శించారు. శ్రీవాణి ట్రస్ట్‌పై శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో అవినీతి చేయాలంటే ఎంతటి వాడైనా భయపడాల్సిందేనని వ్యాఖ్యానించారు.. 70 మంది దళారులను అరెస్ట్ చేసి 214 కేసులు నమోదు చేశాం. గత ప్రభుత్వంలో 2018లో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2019 సెప్టెంబర్ 23న తిరిగి పునరుద్ధరించాం. ఈ ట్రస్ట్ ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయ నిర్మాణాలు, పునరుద్ధరణ చేపడుతున్నాం. ట్రస్ట్ డోనర్స్‌కు రసీదు ఇవ్వడం లేదని కొంతమంది రాజకీయ నేతలు ఆరోపణలు చేశారు అవి సరికాదన్నారు.
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మే 31 నాటికి రూ.816 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మొత్తం లావాదేవీలు బ్యాంకు ద్వారా మాత్రమే చేశాం. రూ.120.24 కోట్లతో వివిధ దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ చేపట్టాం. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ఇతర రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ చేస్తున్నాం. దీనికోసం రూ.139 కోట్లు కేటాయించాం. భజన మందిరాలు, గిరిజన ప్రాంతాల్లో 2,273 ఆలయాల నిర్మాణానికి రూ.227.30 కోట్లు కేటాయించాం. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ఎలాంటి అనుమానాలు ఉన్నా టీటీడీని సంప్రదించవచ్చు. రాజకీయ నాయకులు అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలి అనిఅన్నారు.













